యెహోవానివాసములో అతిథిగా ఉండదగినవాడెవడు?

church-1

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనలు 15:1,2

మన ఇంటికి అతిధులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కారాలు ఎట్లా ఉంటాయో? వేరే చెప్పనవసర్లేదు. అతిధులు మన ఇంట్లో వుండేది అతి తక్కువ సమయమే. అయినా,ఆ సమయంలోనే, మనకు వున్నంతలో వారిని సంతోషపరచి, గౌరవముగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాటిని “అతిధి మర్యాదలు” అంటాము.

దేవుని ఇంటిలోనే, దేవుని చేత అతిధి సత్కారాలు పొందడం అంటే ఊహించగలమా? సాధ్యమేనా? అవును!! సాధ్యమే? అదెట్లా?

  • యదార్ధమైనప్రవర్తన కలిగి యుండాలి.
  • నీతిని అనుసరించాలి.
  • హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి.
  • యదార్ధ మైన ప్రవర్తన:అంటే?మాటలలో యధార్ధత,చూపులలో యధార్ధత, తలంపులలో యధార్ధత, క్రియలలో యధార్ధత.
  • నీతిని అనుసరించాలి:నీతి అంటే?ఆయనను నమ్మడమే నీతి. ఆయనను నమ్మి, అనుసరించాలి. నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి(1కొరింది 15:34)
  • హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి:మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను(ఎఫెస్సి 4:25). ఎందుకంటే? ఆయనే “సత్యం”.
    ఈ విధంగా జీవించినట్లయితే, ఆయన ఇంటిలోనే నీవు ఆతిధ్యం పొందగలవు. ఈలోకంలో నీవు అనుభవించే అతిధి సత్కారాలు తాత్కాళికమే. కాని, ఆయన ఇంటిలో పొందే సత్కారాలు శాశ్వతం. వాటికోసం ప్రయాసపడదాం.

అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు. కీర్తనలు 15:3

ఎవరయితే? యదార్ధ మైన ప్రవర్తన కలిగి,నీతిని అనుసరిస్తూ,హృదయ పూర్వకంగా నిజంమాట్లాడుతున్నారో?అట్టి వారు,నాలుకతో కొండెములాడరు.తన చెలికానికి కీడు చేయరు.తనపొరుగువానిమీద నింద మోపరు.

నాలుకతో కొండెములాడరు:

ఒక వ్యక్తి నీపైనగల నమ్మకంతో వారి విషయాలు నీతో పంచుకున్నప్పుడు, వారిని గురించి ప్రార్ధించు. అంతేగాని, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, వాటికి నాలుగు జోడించి వారిని బజారు పాలుచెయ్యొద్దు.
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
(నిర్గమ 23:1).

తన చెలికానికి కీడు చేయరు:

నీ స్నేహితులకు, నీ పొరుగు వారికి మేలు చెయ్య గలిగితే తప్పకుండా చెయ్యి. ఒకవేళ మేలు చెయ్యలేకపోయినా, మాటలు ద్వారా గాని, చేతలు ద్వారాగాని కీడు తలపెట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు.”నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” (మార్కు 12:31).ఈ ఆజ్ఞను గైకొనినట్లయితే? ఇక కీడు చేసే ప్రసక్తే లేదు.

తన పొరుగువానిమీద నింద మోపరు:

నీ పొరుగు వారు చెయ్యని వాటిని వారే చేసినట్లు నీవు ఊహించుకొని , వాటిని వారిమీద రుద్ది మానసికంగా వారిని క్షోభపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. వారిని నిందించవద్దు. ఇట్టి రీతిగా ఎవరయితే?
యదార్ధ మైన ప్రవర్తన కలిగి,నీతిని అనుసరిస్తూ,హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
వారు నిత్యమూ దేవుని ఇంటిలో ఆతిధ్యము పొందగలరు.

అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.కీర్తనలు 15:4

ఎవరయితే? యదార్ధ మైన ప్రవర్తన కలిగి,నీతిని అనుసరిస్తూ,హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?అట్టి వారు, నాలుకతో కొండెములాడరు.తన స్నేహితునికి కీడు చేయరు.తన పొరుగువానిమీద నింద మోపరు.అంతే కాకుండా, దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు. మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.

దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కొనుట:

అంటే? వారు జరిగించే దుష్ట క్రియలలో ఏ విధంగానూ పాలుపొందక ప్రత్యేకమైన జీవితం జీవించుట.
*నీవు లోకంనుండి ప్రత్యేకించ బడ్డావా?నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను.కీర్తనలు 101:3

దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించుట:

దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించడం అంటే?వారు నడిచే మార్గాలను అనుసరించడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవం. అట్టి ప్రవర్తన నీలో ఉందా?

మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పకపోవుట:

మన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు మాటివ్వలేదు? ఎన్ని ప్రమాణాలు చెయ్యలేదు?
ప్రతీ వాచ్ నైట్ సర్వీస్ రోజు ఒక తీర్మానం. దాని మీద నిలబడింది ఎన్నిరోజులు? మన అవసరాలు తీరే వరకు నాజీవితం ఇక నీకే స్వంతం అంటాం. కాని అవసరం తీరాక? దేవునికి ఎన్ని సార్లు మాటిచ్చామో? వాటి సంఖ్య మన లెక్కకు కూడా అందదేమో కదా? ఇటువంటి పరిస్థితులలో … ఆయన ఇల్లు అనే పరలోకంలో మనకు ఆతిధ్యం దొరకుతుందా? ఆ రాజ్యంలో ఆ రాజుతో జీవించే హక్కు మనకుంటుందా?
పశ్చాత్తాప పడదాం!ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం!

తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడుఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.కీర్తనలు 15:5

ఎవరయితే? యదార్ధ మైన ప్రవర్తన కలిగి,నీతిని అనుసరిస్తూ,హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?అట్టి వారు,నాలుకతో కొండెములాడరు.తన స్నేహితునికి కీడు చేయరు.
తన పొరుగువానిమీద నింద మోపరు.దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించుకుంటారు. దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు. మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు. అంతే కాకుండా,
తన ద్రవ్యము వడ్డికియ్యరు.నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.

తన ద్రవ్యము వడ్డికియ్యరు;

మన కళ్ళెదుటే కడుబీదలుగా వున్నవాళ్ళు నేడు కోట్లకు పడగలెత్తుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం వడ్డీ తీసుకోవడమే. దేవుని వాక్యం తెలిసినవారు కూడా చూసి చూడనట్లుగా వారిపని వారు కొనసాగిస్తున్నారు.అది వారికిగాని, వారి పిల్లలకుగాని ఆశీర్వాదం కాదు. అన్యులు వారికి తెలియదు కాబట్టి వారు క్షమించబడతారేమో కాని, దేవుని పిల్లలముగా మనము తప్పించుకోలేము. నీవు వడ్డీ 10 రూపాయలు తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా అది వడ్డీయే కదా? అపరాధిగా నిలబడాల్సి వస్తుంది. సందేహం లేదు. ఒక బీదవానికి సొమ్ముఅప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు. (నిర్గమ 22:2)

నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.

“లంచము” పరిస్థితులను తారుమారు చేస్తుంది. అతి తక్కువ సమయంలో అక్రమముగా సంపాదించే మార్గాలలో ఇదొకటి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.(యెషయ 5:23).లంచం తీసుకొని దొరికిపోయిన వాళ్ళు అనేకమంది జైలులో గడుపుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగితున్నారు.అంటే? మన దేశ చట్టం కూడా దీనిని ఒప్పుకోదు. ఇక మన దేవుని చట్టం అస్సలు ఒప్పుకోదు. ఈ అన్ని విషయాల ప్రకారం నడచుకొను వాడు. ఎప్పటికి కదల్చబడడు.వారు నిస్సందేహంగా దేవుని ఇంటిలో ఆతిధ్యం పొందుతారు. మన జీవితాలు ఎట్లావున్నాయి?సరిచేసుకుందాం! సాగిపోదాం! ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!ఆమెన్!ఆమెన్!

Post Author: Sudhakar Babu kona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *