దేవుని సన్నిధిని గూర్చిన ఆరాటం

As the hart panteth for the water brooks, so panteth my soul for Thee, O God
As the hart panteth for the water brooks, so panteth my soul for Thee, O God

దేవుని సన్నిధిని గూర్చిన ఆరాటం

42 వ కీర్తనా ధ్యానము:

రచయితలు: కోరహు కుమారులు.

దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.కీర్తనలు 42:1

దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఎట్లాంటిది అంటే?తన ప్రాణముణే ఫణముగాపెట్టి, ప్రాణమును రక్షించుకోవడం వంటిది.ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా, దాని ఆశలు అడియాశలే.కాని నీటి మడుగును చేరేవరకు దాని ఆశ చావదు. తన పయనం ఆగదు.నీటి మడుగు కోసం తాను చేసే ప్రయాణంలో ఎన్నో ఆపదలు.పొదల చాటున పొంచివుండే పులులు, సింహాలు.అయినా వేటిని లెక్కచెయ్యకుండా సాగిపోతుంది గమ్యం చేరేవరకు. ఆ నీటి మడుగును చేరగానే, తాను చేసిన ప్రయాణం, అలసట ఏమి గుర్తుండదు. ఆనందంతో కేరింతలు కొడుతుంది.దాని ఆశ దాని గమ్యం చేర్చుతుంది.
మరి నీ ఆశ ఏమిటి?నీ గమ్యమేమిటి?శారీరాశా?నేత్రాశా?జీవపు డంబమా?దాని కోసమేనా నీ పోరాటం?అయితే, గమ్యం భయంకరం.

కాని, ఈ కీర్తనా రచయితలు అయిన కోరహు కుమారుల ఆశ మాత్రం” యేసయ్య నిన్ను చేరాలన్నది మా ఆశ.”ఎందుకు?కృంగిన జీవితాలకు ఆదరణ,నలిగిన వారికి ఓదార్పు,బహీనులకు బలం,ఆపదలో ఉన్నవారికి విడుదల.ఆయన చెంతే సాధ్యం.జీవిత పరుగు పందెములో అలసిపోయావా?ఆయన చెంత చేరు.నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడుస్తాడు.ఈమాట చెప్పగలవా?”యేసయ్యా నిన్ను చేరాలన్నదే నా ఆశ”చెప్పగలిగితే ఆయనే నీకు ఎదురొస్తాడు.నిన్నెత్తుకుంటాడు. ఎప్పటివరకు? ముదిమి వరకు.

కాని ఆయన్ని చేరే మార్గంలో కొన్ని ఇబ్బందికర పరిస్తితులు వుంటాయి.క్రూర మృగం(సాతాను) పొంచివుంటుంది.భయపడకు సాగిపో.ఆయన చెంత చేరు వరకు.

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?కీర్తనలు 42:2

మన తృష్ణ ఏమిటి?”తృష్ణ” అంటే మామూలు “కోరిక” కాదు. కోరిక కంటే వెయ్యి రెట్లు అధికమయినది.
మన తృష్ణ! సంపదలు, అధికారం, పేరు ప్రతిష్టలు కోసమేనా? కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమేనా? కాదు. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని కోసమే అయ్యుండాలి. ఆశీర్వాదాలకు కర్త మనతో వుంటే, ఇక ఆశీర్వాదాలతో పనేముంది?దేవుళ్ళు అని చెప్పుకొనే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాని “జీవముగల దేవుడు” ఒక్కడే. ఆయన పైనే తృష్ణ కలిగి వుండాలి. నీ దాహం తీరాలంటే ఆయనచెంతే.ఆయనే ఒక “సజీవ జీవజల నది”( అది ఎల్లప్పుడు ప్రవహించేది)ఎడారిలో సహితం 30 లక్షల మంది దాహార్తిని తీర్చగలిగింది ఆ జీవజల నది. దావీదు అంటున్నాడు “ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది.” (కీర్తనలు 143:6)నీజీవితం ఎడారిలా మారి, ఒక్క నీటిబొట్టు కనిపించని స్థితిలో, ఎండిపోయిన భూమివలె నీవుంటే, ఆయన ఎడారిలో ఒక నదిలా ప్రత్యక్షమవుతాడు. ఎండిన భూమి వంటి నీ జీవితానికి నీరుకట్టి ఫలవంతం చేస్తాడు. ఎప్పుడు? ఆయన కొరకు నీవు తృష్ణ కలిగివున్నప్పుడు.దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా? అని వారి ప్రాణం తహతహ లాడుతుందట.
కాని మనమంటాము. దేవుడు ఇంట్లో లేడా? అని. వున్నాడు. మరెందుకు దేవుని సన్నిధికి?అక్కడ దేవుడు వున్నాడు.దేవుని బిడ్డల సహవాసం వుంది.దేవుని వాక్యం ప్రకటించే సేవకులున్నారు.సహవాసం తప్పనిసరి. నీవు ఒక్కడివే మండితే కొంతసమయానికి ఆరిపోతావు.అదే సహవాసంలో వుంటే, ఒకవేళ నీవు ఆరిపోతున్నా, నీప్రక్కన వున్న కట్టెలు (విశ్వాసులు)నిన్నుమండిస్తాయి. తిరిగి మండడం ప్రారంభిస్తావు.దేవునిని గాని, దేవుని సన్నిధినిగానినిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, అగ్నితోఆటలాడుతున్నట్లే ! అది నీకు క్షేమం కాదు.

నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.కీర్తనలు 42:3

హృదయం కృంగిన సమయంలో,ఏమార్గము కానరాని పరిస్తితుల్లో, ఆర్ధిక ఇబ్బందులు, శారీరిక ఇబ్బందులు, కుటుంబంలో సమాధానం లేని స్థితి, మానసిక ఒత్తిడి, ఇట్లా ఒకదాని వెంబడి మరొకటి వేధిస్తున్న సమయంలో, ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితుల్లో, ఓదార్చేవారు లేరు.ఆదరించేవారు అంతకన్నాలేరు.క్రుంగిపోయినా, ఆయన పైనే ఆశతో సాగిపోతున్న తరుణంలో, ఒక ప్రక్క లోకం నీప్రార్ధన ఏమయ్యింది?నీ విశ్వాసం ఏమయ్యింది?నీ దేవుడు ఏమయ్యాడు? అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తూ, నీ ప్రార్ధన సరయినది కాదని ఒకరు.నీ దేవుడు సమర్ధుడు కాదని మరొకరు.ఇట్లా… లోకం దాడి తట్టుకోలేక, ఏది వాస్తవమో తేల్చుకోలేక హృదయం మరింత క్రుంగిపోతుంది.కోరహు కుమారులు లోకస్టుల దాడి తట్టుకోలేక, వారి కన్నీళ్ళే వారికి ఆహారం, పానముగా మారాయట. ఇట్లాంటి అనుభవాలు నీజీవితంలో ఎదురయితే క్రుంగిపొవలసిన పనిలేదు. నీ ప్రియ రక్షకుడు అయిన యేసయ్య సహితం, గేళిచేయబడ్డాడు.
నీకంటే ముందుగానే ఇవన్ని ఆయన అనుభవించాడు. నీవు యేసయ్యను చేరాలని ఆశగలిగి, అటువైపు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకవైపు సాతాను, మరొకవైపు లోకం నీపైన దాడి చెయ్యడం సహజం.
క్రుంగిపోవద్దు!కళ్ళల్లో కన్నీరెందుకు ?గుండెల్లో దిగులెందుకు?నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా?గుండెల్లో గాయమయినదా?ఇక వుండబోదుగ.యేసే నీ రక్షణయేసే నీ నిరీక్షణ
నీరసించిపొకు, నిరీక్షించు.మారా( చేదు) వంటి నీజీవితాన్నిమధురముగా మార్చుతాడు. మారని నీ దేవుడు.

జనసమూహముతో పండుగచేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.కీర్తనలు 42:4

గతకాల స్మృతులు కొందరిని ఆనందంలో ముంచెత్తితే,కొందరిని విషాదంలో పడేస్తాయ్.
ఈ కీర్తనా రచయితలైన కోరహు కుమారుల గతకాల జ్ఞాపకాలు వారి కృంగిన జీవితాలను మరింత కృంగదీస్తున్నాయ్.గతకాలంలో,దేవుని మందిరానికి వెళ్ళారు. వాళ్ళే కాదు. వారితో పాటు అనేకమందిని దేవుని సన్నిధికి నడిపించారు.దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతీసారి వారి ఆనందం పండుగను తలపించేది. దేవుని సన్నిధిలో అద్భుతంగా పాడి,సంతోషంతోఆయనను స్తుతించేవారు.కాని ఇప్పుడయితే,దేవుని సన్నిధి దూరమయ్యింది. దానికోసం ఆరాటపడుతున్నారు.వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించినవారే వాళ్ళపై తిరగబడిన పరిస్టితులు.అప్పుడయితే దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతీసారి పండుగే. కాని ఇప్పుడయితే “పండుగే పండుగగాలేదు.”హృదయమంతా వేదనే. ఇంకెక్కడి పాటలు.మన పరిస్థితి ఏమిటి? మన జీవితాలు ఆధ్యాత్మికంగా నానాటికిదిగజారుతున్నాయా? ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఆశక్తి. మరిప్పుడు? ఒకప్పుడు క్రమం తప్పని వాక్య ధ్యానం, ప్రార్ధన.మరిప్పుడు?మనం దేనికి బానిస అయ్యామో, అవి దేవునినుండి దూరంచేస్తున్నాయి అని తెలిసినా ,మన మనఃసాక్షిని పీక నులిమి చంపేసి మనం బ్రతుకుతున్నమా?

దేవునిని గురించి, దేవుని సన్నిధిని గురించి వారికున్న ఆశ, తాపత్రయం చూడండి.
అట్టి ఆశను కలిగివుందాం!కోల్పోయిన ఆస్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం!తిరిగి ఆయన సన్నిధిలో, ఆయనతో కలసి నిజముగా ఆనందించే అనుభవంలోనికి ప్రవేశిద్దాం!

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.కీర్తనలు 42:5

“నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? …….దేవునియందు నిరీక్షణ యుంచుము”ఈమాటలు
ఎవరు చెప్పగలరు?ఒక విశ్వాసి చెప్పగలడు.ఎప్పుడు చెప్పగలరు? విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే.విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి?ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకెవ్వరులేరు అనుకున్నప్పుడు, పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్థితి.అందుకే కీర్తనాకారుడు ఇట్లా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకొంటున్నాడు. ఒంటరితనమా?సమస్యల సుడిగుండమా?చెలరేగే తుఫానా?ఆప్తులంతా దూరమైన పరిస్టితా?ఆధ్యాత్మిక, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యలా?శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా? సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా?పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా? గమ్యం తెలియని పయనమా? అయితే, నీ ప్రతీ పరిస్థితికి యేసయ్య లోపరిష్కారం.

నీలో నీవు తొందర పడొద్దు:

బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలోనీవు కంగారుపడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదుకదా? బస్సు….డ్రైవర్ చేతిలో వుంది.అట్లానే, నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో వున్నప్పుడు. ఆయనే ప్రతీ పరిస్థితి గుండా నడిపిస్తూ గమ్యం చేర్చుతాడు.

దేవుని యందు నిరీక్షించు:

ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో? ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని. నీకు కాకపోవచ్చు. కాని, నీ దేవునికి సమస్తము సాధ్యమే. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:18 (ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు.)
నీవు నిరీక్షించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు.

శ్రమలలో దేవుని స్తుతించు:

నీ సమస్యలు ఎంత ఎక్కువగా వుంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించు.
ఆ స్తుతుల మధ్య సాతాను నిలువలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే, నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. ఇక శాంతి, సమాధానమే నీ దగ్గర మిగులుతుంది.
ప్రయత్నించి చూడు!విజయం నీదే!

నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.కీర్తనలు 42:6

ఈలోక యాత్రలో,మన జీవిత పయనంలో, ఎప్పుడో ఒకప్పుడు ఈ అనుభవాలు తప్పకుండా తారస పడతాయి.

యొర్దాను నది:

లేబానోనులో పుట్టి మృతసముద్రంలో కలుస్తుంది. యోర్దాను మరణమునకు సాదృశ్యము.
కొన్ని సందర్భాలలో ఈ సమస్యల నుండి విడుదల పొందలేము. ఇక మరణమే శరణ్యం అనే పరిస్తితులలో హృదయం కృంగిపోయిన స్థితి.

హెర్మోను పర్వతము:

హెర్మొనుయొక్క “మంచు ” ఆ తెలుపు పరిశుద్దతకు, ప్రశాంతతకు సాద్రుశ్యముగా ఉన్నప్పటికీ, అక్కడ శీతోష్ణ పరిస్టితులు జీవనానికి ఏమాత్రం అనుకూలించవు.ఈ లోకంలో ప్రత్యేకముగా, పరిశుద్దముగా జీవించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో, మనకు అనుకూలించని పరిస్థితులు పర్వతములా అడ్డుపడిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి పరిస్తితులలో హృదయం కృంగిన స్థితి.

మిసారు కొండ:”

మిసారు” అనగా “చిన్నది” అని అర్ధం. ఇది చిన్నదే కావొచ్చు. కాని ఇది సృష్టించే గందరగోళం చాలా పెద్దది. అబ్షాలోము తన తండ్రి “రాజైన దావీదును” చంపడానికి తరుముతున్న సమయంలో దావీదు తప్పించుకొని పారిపోయిన కొండ ఇది. మన కుటుంబస్తులే మన మీద తిరుగబడి, మన మీద కాలుదువ్వుతున్న సందర్భములో హృదయం కృంగిన స్థితి.ఏ స్థితిలో నీ హృదయం క్రుంగిపోయిందో?ఆ పరిస్థితితో సంబందం లేకుండా నిన్ను విడిపించగల సమర్ధుడు నీ దేవుడు.
అయితే నీవు చెయ్య చెయ్యవలసింది ఒక్కటే. నీ సమస్యలలో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం.

నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.కీర్తనలు 42:7

కరడు అంటే “అల”ఒక అల, మరొక అలను పిలిచి, ఆ అల ఇంకొక అలను పిలచి ….. ఇట్లా ఇవన్ని కలసి ఒక పెద్దతరంగమై లేస్తే? ఇక దాని దాడికి ఎవరు నిలువగలరు? అవసరమయితే సునామిగా మారి భూమినే జలసమాధి చెయ్యగలవు.మన జీవిత యాత్రలోకుడా ఇది సర్వ సాధారణం. ఒక సమస్య మరొక సమస్యను పిలచినట్లుగా ఈ సమస్యలన్నీ ఒక సుడిగుండమై మనలను ఊపిరాడకుండా చేసే పరిస్తితులు అనేకం.అయినప్పటికీ, “నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు.” (యెషయా 43:2).జలములు చూచి భయపడి ఆగిపోతే అప్పుడు దేవుడు నీకు తోడుగా వుండడు.ఆ జలములలో అడుగుపెట్టాలి. ముందుకు నడవాలి. అప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. ఆ జలాలు నీమీద పోర్లిపారకుండా అడ్డగిస్తాడు. (నీరు “పరిశుద్దాత్మకు” సాదృశ్యము. కాని ఇక్కడ జలములు “శోధనలు, శ్రమలకు” సాదృశ్యముగ వున్నవి)
సమస్య రాకముందే దేవుడు దానిని రాకుండా ఆపివేయవచ్చు కదా! అని అనుకోవద్దు. అట్లా చేస్తే “దేవుని తోడు “ఎట్లా వుంటుందో నీకేమి తెలుస్తుంది? నీవు ఒక సమస్యగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క తోడ్పాటును, ఆయన కృపను అనుభవించ గలవు.సమస్యలన్నీ సుడిగుండమై నిన్ను చుట్టినను, అవి నీ మీద పొర్లిపారినను వాటన్నిటి నుండి తప్పించగల సమర్ధుడు నీ దేవుడు. అగ్ని గుండములోనుండి ఆ యువకులను తప్పించగలిగిన దేవుడు, సమస్యల సుడిగుండంలో నుండి నిన్నునూ తప్పించగలడు.

అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.కీర్తనలు 42:8

ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగినా, వారి చెప్పులు అరిగిపోలేదు. వారి వస్త్రాలు చినిగిపోలేదట. అంటే, వారు ధరించిన చెప్పులుగాని, వస్త్రాలుగాని అంత శ్రేష్టమైనవా? కానే కాదు.
అంత శ్రేష్టమైన వస్తువులు వాళ్లకి వుండే అవకాశంలేదు. ఎందుకంటే గతించిన 430 సంవత్సరాలనుండి వారి తరాలన్నీ బానిస బ్రతుకులే. మరి వారికి అది ఎట్లా సాధ్యం అయ్యింది? “అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల దేవుడు వారికి తోడుగా వున్నాడు.”తన బిడ్డలపట్ల ఆయన అంత శ్రద్ధ తీసుకుంటాడు. అది ఎట్లా వుంటుంది అంటే మన ఊహలకు అందనంతగా వుంటుంది. ఆ అరణ్యంలో మండుటెండలో వారికోసం గొడుగులు, రాత్రివేళ వెలుగు కోసం దీపాలను సిద్దపరిస్తే వారు వాటిని మోయడం కష్టం అనుకున్నాడెమో ఆయన. అందుకే, పగటివేళ మేఘ స్తంభాన్ని, రాత్రివేళ అగ్ని స్తంభాన్ని సిద్దం చేసాడు.ఎందుకోసం ఆయనకు మన మీద అంత శ్రద్ధ?మనము పరిశుద్దులమనా?
నీతిమంతులమనా?కానే కాదు.ఎందుకంటే ఆయన మన “జీవదాత”మనకు జీవమును దానముగా ఇచ్చినది ఆయనే. మనకోసం తన ప్రాణం ఇచ్చింది కూడా ఆయనే. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.అపొ.కార్యములు 3:15
నీ జీవదాత నేటికి జీవించే వున్నాడు. ఇక తరతరములు జీవించే ఉంటాడు.నీవు పాడే కీర్తన, నీవు చేసే ప్రార్ధన ఆ జీవదాత నీకు తోడుగా ఉండేటట్లు చేస్తాయి.ఆయనే జీవన దాత!ఆయనే ముక్తి దాత!ఆయనే శక్తి ప్రదాత!నీలో నీవు క్రుంగిపోవద్దు!నిరీక్షణతో సాగిపో!

నీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.కీర్తనలు 42:9

ఈలోక జీవన యాత్రలో అనేకమైన సమస్యలు మనకు శత్రువులుగామారి, సమాధానం లేకుండా చేసినప్పుడు మన హృదయంలో పుట్టే మొట్టమొదటి తలంపు ఇదే. “నీవేల నన్ను మరచి యున్నావు? అని.కాని ఒక్క విషయం, ఆయనే మనలను మరచిపోతే, అసలు ఆ మాట అనడానికి కూడా మనము బ్రతికి ఉంటామా? ఆయన నిన్ను మరువడు. తల్లి తన బిడ్డలను ఎట్టిపరిస్తితులలోను మరచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అట్లా జరిగినా జరగవచ్చేమోగాని, ఆయన మాత్రం నిన్ను మరువడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. (యెషయ 49:15).ఒకవేళ నీవు ఆయనను మరచిపోయినా గాని, ఆయన నిన్ను మరచేవాడు కాడు. నీవు హాయిగా నిద్రపోతున్నా, ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలి కాస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. (కీర్తనలు 121:4)శోధనలు నిన్ను చుట్టిముట్టి నప్పుడు “ఆశ్రయదుర్గమైన” నీ దేవుని ప్రార్ధించు.”దుర్గము” అంటే శిల, రాయి,
కొండ, బండ పాత నిబంధనలో 30 సార్లు దేవునిని బండతో పోల్చడం జరిగింది. నూతన నిబంధనలో కూడా యేసయ్య బండతో పోల్చబడ్డారు ( 1 కొరింది 10:4)”బండ” బలం, ఆశ్రయం, మార్పులేని గుణం, స్థిరత్వం మొదలగు మొదలగు వాటికి సాద్రుశ్యముగా వుంది. ఆయన ఆశ్రయ దుర్గము (కీర్తనలు 94:22)ఆయన రక్షణ దుర్గము (కీర్తనలు 95:1)నీ సమస్యలలో ఆయనను ఆశ్రయించ గలిగితే (ప్రార్ధించగలిగితే), వాటినుండి రక్షించబడతావు. శాంతి, సమాధానం నీ స్వంతమవుతుంది.

నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.కీర్తనలు 42:10

జీవిత నావ ప్రశాంతముగా ఏ అలజడి లేకుండా సాగిపోతున్న సమయంలో ….. ఏదో ఒక క్షణమున చిన్నగా తుఫాను ప్రారంభమై గొప్ప విద్వంసం సృష్టిస్తుంది.తెరచాప చినిగిపోయి ఆ నావను ఎటువైపు తీసుకెల్తుందో అర్ధంకాని పరిస్థితి.చుక్కాని ఆ తుఫాను దాడికి తట్టుకోలేక విరిగిపోయే పరిస్తితులు.
అంతవరకు ఆ నావ బరువును మోసిన ఆ నీరే కెరటాలుగా లేచి ఆ నావను బ్రద్దలగోట్టే పరిస్థితి. మరొక వైపు చీకటి పడుతూ అద్దరి కానరాని పరిస్తితులు. ఎటుపోతుందో ఈ నావ?దీని గమ్యం ఎక్కడికో? అవును! శోధనల గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, మిత్రులు సహితం, శత్రువులుగా మారి కృంగిన జీవితాన్ని మరింత క్రుంగదీసే పరిస్థితి. ఆదరిస్తారు అనుకున్నావారే మనమీద ఎదురు తిరిగిన సందర్భాలు.వారు ప్రవర్తించిన తీరు, మాట్లాడే విధానం ఎముకలు విరిగినప్పుడు పడే బాధకంటే అధికం.యోబు శోధనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ముగ్గురు స్నేహితులు వ్యవహరించిన తీరే దీనికి గొప్ప ఉదాహరణ.పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు, యేసు వైపు కాకుండా, వీస్తున్న గాలులవైపు చూచి మునిగిపోసాగాడు. నీవు మాత్రం లోక రక్షకుడైన యేసు వైపే చూడాలి తప్ప, గాలులు అనే లోకం వైపు చూడొద్దు. వారి మాటలకు క్రుంగిపోవద్దు.

ఆశ్రయదుర్గమును, రక్షణ దుర్గమును అయిన దేవుడు నీతో వున్నాడు. సోమ్మసిల్లిన నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. స్థిర విశ్వాసంతో ఈ మాట చెప్పు. “నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.” (కీర్తనలు 42:11). అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!ఆమెన్! ఆమెన్!

Post Author: Sudhakar Babu kona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *