(84 వ కీర్తనా ధ్యానం) రచయితలు: కోరహు కుమారులు.
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములుయెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.కీర్తనలు 84;1,2
దేవా! నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ పాడుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఆయన మందిరం యొక్క అందచందాలను పొగడడం కాదు. ఆయన నివాసం వారికి ప్రియమైనది. ఆ ప్రియమైన నివాసంలో చేరి, ఆ ప్రియమైన దేవుని ఆరాధించాలన్నదే వారి ఆశ. వారి ఆశ ఎంత అంటే?ప్రాణం సొమ్మ సిల్లిపోయేటంత.ఎందుకు అంత ఆశ?ఆ మందిరంలో జీవముగల దేవుడున్నాడు. (అంటే? జీవములేని దేవుళ్ళు కూడా ఉంటారన్నమాట.)ఆ దేవుని ఆరాదించడానికి వారి హృదయమును వారి శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయట.ఇట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించింది. “ఆత్మ సిద్దమే గాని, శరీరం బలహీనం ” అన్నట్లు జీవిస్తున్నాం. దేవుని సన్నిధికి ఎప్పుడువెళ్ళాలా? అని వారి ప్రాణం తహతహ లాడుతుందట. కాని మనమంటాము. దేవుడు ఇంట్లో లేడా?అని. వున్నాడు.
మరెందుకు దేవుని సన్నిధికి?అక్కడ దేవుడు వున్నాడు.దేవుని బిడ్డల సహవాసం వుంది.దేవుని వాక్యం ప్రకటించే సేవకులున్నారు.సహవాసం తప్పనిసరి. నీవు ఒక్కడివే మండితే కొంతసమయానికి ఆరిపోతావు. అదే సహవాసంలో వుంటే, ఒకవేళ నీవు ఆరిపోతున్నా, నీప్రక్కన వున్న కట్టెలు (విశ్వాసులు )నిన్ను మండిస్తాయి. తిరిగి మండడం ప్రారంభిస్తావు.దేవునిని గాని, దేవుని సన్నిధినిగానినిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, అగ్నితో ఆటలాడుతున్నట్లే ! అది నీకు క్షేమం కాదు.
సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరి కెను.నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.కీర్తనలు 84:3,4
కోరహు కుమారులు ధన్యతను గూర్చి పాడుతున్నారు. ఎవరు ధన్యులు?దేవుని మందిరమందు నివసించేవారు.
అనగా, ఆయనకు సమీపముగా జీవించేవారు.ఎందుకు వారు ధన్యులు?వారు నిత్యమూ దేవునిని స్తుతిస్తారు.
ఇంతకీ, ఇక్కడ దేవుని మందిరంలో నివసించేది ఎవరు? పిచ్చుకలు, వాన కోవెలలు, ఆయనను సేవించే యాజకులు.ఈ తలంపు వారికి కొంత అసూయను, కొంత వేదనను కలిగిస్తుంది. ఎందుకంటే?పిచ్చుకలు, వాన కోవెలలు సహితం ఆయన మందిరంలో నివసిస్తూ, వేకువనే లేచి స్తుతిపాటలు పాడుతున్నాయి. అవెంతటి ధన్య జీవులు?మందిరంలో సేవచేసే యాజకులు ఎంతటి ధన్యులు?అట్లాంటి ధన్యత మాకు లేదే? అని. అబ్బా!దేవుని సన్నిధికి వెళ్ళడంకోసం, ఆయన్ని ఆరాధన చెయ్యడంకోసం వారికెంత ఆరాటం?వారి ఆశ ఒక్కటే! ఆయన్ని చూడాలి. ఆయన దరి చేరాలి. నేటి మందిరాలలో ఇట్లాంటి విశ్వాసులుకరువయ్యారు.సేవకులూకరువయ్యారు. ఈ గుంపులోమనమున్నామా?సందేహం లేదు. వారికున్న ఆశ మనకుంటే? నేటికీ నామకార్ధ క్రైస్తవులుగానే ఎందుకు జీవిస్తున్నాం?పేరుకు మాత్రమే క్రైస్తవులంతప్ప,కనుచూపు మేరల్లోకూడా,క్రియల్లోమాత్రం ఎక్కడా క్రైస్తవ్యం కానరాదే?అలవాటుగా ఆరాధనకు వెళ్తున్నాంతప్ప, ఆరాధించే హృదయం మాత్రం దేవునికి దూరమయ్యిందిగదా!జ్ఞాపకముంచుకో!!!దూరమైన నీ హృదయం తిరిగి ఆయనకు సమీపమైతేనే ఆ ధన్యతలోనికి ప్రవేశించ గలవు.
నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.
కీర్తనలు 84:5
కోరహు కుమారులు ఇంకనూ ధన్యతను గురించి పాడుతున్నారు. వారంటున్నారు ఆయన వలన బలమునొందే మనుష్యులు ధన్యులు. అవును! కొన్ని సందర్భాలలో వారు బలహీనులుగానే కనిపించవచ్చు గాని, వారి బలము అంచనాలకు అందదు. ఎందుకంటే? ఆయనే వారి బలం.అందుకే వారంటున్నారు. “నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.”
(కీర్తనలు 73:26). ఆయన వలన బలమునొందిన మనుష్యులకు యాత్ర చేసే మార్గాలు ఎంతో ప్రియమైనవి. వారు ధన్యులు. పురుషులందరూ సంవత్సరమునకు మూడు సార్లు నియామకకాలంలో యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలని ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన కట్టడ.అందుచే ఆ సమయాల్లో అనేక ప్రాంతాలనుండి ప్రజలు యాత్రచేసి అక్కడకి చేరుకుంటారు. ఆ యాత్ర చేసినవారందరూ ధన్యులు కాదు గాని, ఎవరయితే దేవుడు నియమించిన కట్టడను ప్రియముగా ఎంచి, సంతోషముగా ప్రతీ పరిస్థితిని ఎదుర్కొని ఆ మార్గములయందు ఆనందించ గలుగుతారో వారే ధన్యులు. దేవుని మందిరానికి వెళ్తున్న మనమంతా ధన్యులంకాదుగాని, ఎవరైతే ఆయనను ఆరాధించాలని నిజమైన ఆశను కలిగి వుండి, ఆయన్ని ఆరాధించగలుగుతారో వారే ధన్యులు. వారే దేవుని బలాన్ని పొందుకోగలరు.
ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణం సాగిస్తున్నాం. కొండలు-లోయలగూండా సాగిపోవాలి. జీవితంలో ప్రతీరోజు నూతనమైన అనుభవమే. ఆయన నుండి బలాన్ని పొంది, ప్రతీ పరిస్థితిని ఆయన యందు ఆనందిస్తూ ఆ ధన్యత లోనికి మనం ప్రవేశించాలి.
వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.కీర్తనలు 84:6,7
సియోను లేదా నూతన యెరుషలేము యాత్రలో నీ జీవితంలో అనేక శోధనలు, శ్రమలు అనుభవించవలసి వస్తుంది.
“బాకా లోయ” అది “కన్నీటి లోయ” నీ కన్నీటితో లోయలు సహితం నింపబడవచ్చు. అయితే, ఒక్కటి మాత్రం నిజం.
నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడవబోతున్నాడు.నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీవు కార్చిన ప్రతీ కన్నీటిబొట్టు ఒక దీవెనగా మారబోతుంది. కన్నీటి లోయ “ఆశీర్వాదపు నిధి” గా ఆవిర్భవించబోతుంది.ఆశీర్వాదపు జల్లు అనే “ప్రారంభపు వర్షం” నీ ఆశీర్వాదపునిధిని మరింత ఫలవంతం చేయబోతుంది. కృప వెంబడి కృపతో దేవుడు నిన్ను నింప బోతున్నాడు. కన్నీరు, శ్రమలు, శోధనలు ఇవన్నీ పరమ సియోనుకు మార్గాలు. ఇవే నిన్ను గమ్యం చేరుస్తాయి. శ్రమలలో, శోధనలలో మన పరిశుద్దతను, విశ్వాస్యతను కాపాడుకొంటూ గమ్యమైన పరమ సియోను వైపు సాగిపోవాలి. ఈ యాత్రలో నీకు నీవుగా గమ్యం చేరలేవు. అను నిత్యమూ ఆయన బలాన్ని పొందుకొంటూ, ఆయన పైనే ఆధారపడుతూ ఆ గమ్యం చేరాలి. ఈ రీతిగా ఎవరు చేయగలరో వారు మాత్రమే ఆ పరమ సియోనులో కనబడతారు.
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము.దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.కీర్తనలు 84:8,9
కీర్తనా రచయితా యాకోబు దేవునికి ప్రార్దిస్తున్నాడు. “యాకోబు దేవుడు” అని పాత నిబంధనలో 24 సార్లు వ్రాయబడింది. అట్లా పిలవబడడానికి యాకోబుకున్న ప్రత్యేకత అంటూ ఏమిలేదు. యాకోబు అనే పేరుకే మోసగాడు అని అర్ధం. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకంతగా హెచ్చించాడు?ఆయన కృపగల దేవుడు. తన ప్రజలు తప్పులు చేసినా తన వాగ్దానాలను నిలబెట్టుకొనే దేవుడు. గొప్ప సహనం గల దేవుడు.పాపులను పరిశుద్దులుగా మార్చే దేవుడు. ఒక వ్యక్తిని లేదా ఒక జాతిని తన చిత్తానుసారముగ ఎన్నుకొనే దేవుడు.అట్లా యాకోబును ఎన్నుకున్నాడు.
యాకోబు ఏదేవుని దేవుడుగా కలిగి యున్నాడో? ఆ దేవుని దేవుడుగా కలిగి యున్న జనులు ధన్యులు. అందుకే రచయిత ఆ దేవునికే ప్రార్ధిస్తున్నాడు. కీర్తనా రచయిత అభిషేకించబడిన రాజును గురించి ప్రార్దిస్తున్నాడు.
పాలకులను గురించి, అధికారులను గురించి ప్రార్ధించ వలసిన భాద్యత మన మీద వుంది. వారు చేసే పనులు నచ్చకపోతే బంద్ లు, ధర్నాలు చేస్తాం. అనేక సార్లు అవి ఫలితాలను ఇవ్వవు. ఇచ్చినా అవి తాత్కాళికమే.
అదే మనము వారికోసం ప్రార్ధించగలిగితే, దేవుడు వారి అంతరంగములో మార్పు తీసుకొని రాగలడు.
అప్పుడు వారి జీవితాలు మార్పుచెందుతాయి, వారు తీసుకొనే తీర్మానాలలో కూడా మార్పు వస్తుంది.మతచాందస వాదులు, వారికున్న అభిప్రాయాలను “ప్రాధమిక విద్య” నుండే పిల్లలలోనికి చొప్పించాలని వేగంగా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. మనకున్న ఆయుధం ఒక్కటే. పాలకుల కోసం ప్రార్దిద్దాం. ఒకవేళ అదే దేవుని చిత్తం అయితే? ఆ పరిస్థితులను తట్టుకోగలిగే ధైర్యం ఇవ్వమని ఒకరికొకరు ప్రార్ధించు కుందాం!
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.కీర్తనలు 84:10
ఈ కీర్తనా రచయితలైన కోరహు కుమారులు చేసేపని ఏమిటంటే?”దేవుని ఆలయమునకు ద్వార పాలకులు” ( 1 దిన 9:19 )దేవుని ఆలయం పట్ల, ద్వారపాలకులైన వీరు కలిగియున్న అత్యున్నతమైన తలంపులను చూస్తేఅర్ధమవుతుంది వారు దేవుని ఆలయానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అతున్నత మైనదో!దేవుని ఆలయ ఆవరణలో ఒక్క దినం గడిపితే? అది మనం బయట గడిపే మూడు సంవత్సరాలతో సమానమాట. వారమునకు ఒక్కసారి దేవునిసన్నిధిలో గడిపే రెండు గంటలు, బయట గడిపే రెండు వేల గంటలతో సమానమాట. అసలు ఇట్లాంటి తలంపే మనకు రాదు కదా! అందుకే మనకు దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం.ఆ రెండు గంటలు అయినా మనుష్యులము మాత్రమే అక్కడ కూర్చుంటాంతప్ప, మనసులు మాత్రం ఊరంతా తిరుగొస్తాయ్.వారు ఇంకా ఇట్లా చెప్తున్నారు.
“భక్తిహీనుల గృహాల్లో, వారితో కలసి ఉండేకంటే, దేవుని మందిర ద్వారం వద్ద వుండుటే మాకిష్టం”దేవుడు వారికప్పగించిన భాద్యతను నెరవేర్చడం వారికిష్టం.దేవుడు వారికిచ్చిన పనిలో సంతోషించడం వారికిష్టం. దేవుడు వారిని ఏ స్థితిలో వుంచాడో, ఆ స్థితిలోనే వుండడం వారికిష్టం. నేటి మన మందిరాలలో, మన జీవితాలలో ఈ పరిస్తితి ఉందా?లేకనే కదా? నేటి మందిరాలలో తన్నుకుచస్తున్నాం. మనమెంత ఉన్నతస్థాయికి ఎదిగి పోయామంటే? దేవునిని సహితం బయటకి త్రోసేసి ఆయన స్థానాన్నే మనము లాగేసుకొంటున్నాం. అధికారం కోసంఆరాటపడుతున్నాం.కాని వీళ్ళయితే దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడి ఆయన పరిచర్య చేసే వారుగా వున్నారు. అట్లా ఉండడమే వీరికిష్టమట.మనమొక తీర్మానానికి వద్దాం. మందిరం శుభ్రం చేసే వారిగా దేవుడు మనలను ఉంచితే అట్లానే ఉందాం. ఏ స్థితిలో? ఎక్కడ? దేవుడు మనలను ఉంచితే అదే స్థితిలో, అక్కడే ఆయన కోసం నమ్మకముగా జీవిద్దాం!
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యేమేలును చేయక మానడు.కీర్తనలు 84:11
సూర్యుడు:ఈలోకయాత్రలో నీకు వెలుగునిచ్చి నడిపించే నీతి సూర్యుడు ఆయనే!
కేడెము:శత్రువుల బారి నుండి రక్షించే డాలు ఆయనే.
కృప:నేటి వరకు జీవించి యున్నాము అంటే కారణం ఆయన కృపయే.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16
ఘనత:మనము ఆయనను సేవించి, ఆయనను వెంబడించ గలిగితే? ఆయన మనలను ఎంతగా ఘనపరుస్తాడు అంటే, ఆయనతో కలసి ఆయన సింహసనములో కూర్చునేటట్లుగా అంతగా ఘనపరుస్తాడు. “ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును”.యోహాను 12:26
మేలు:యదార్ధ జీవితం, భయముతో కూడిన భక్తి కలిగియున్న వారికి, వారి జీవితాలను మేళ్ళతో నింపుతాడు.
యదార్ధత అంటే?నీవు నీ ఇంట్లో వున్నప్పుడు ఎట్లా సత్ప్రవర్తన కలిగి జీవించావో? అట్లానే, నీవు నీ కుటుంబానికి దూరంగా, నీ వారెవ్వరూలేని ప్రదేశంలో కూడా అట్లాగే జీవించగలగడం యదార్ధత. “యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు”.
కీర్తనలు 34:9
సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమి్మకయుంచువారు ధన్యులు.కీర్తనలు 84:12
కోరహు కుమారులు ఈ కీర్తనను ధన్యతతో ముగిస్తున్నారు. ధన్యకరమైన జీవితం ( ఆశీర్వదింప బడిన జీవితం)జీవించాలంటే ఎట్లా సాధ్యం? ఆయనను “నమ్ముట” ద్వారానే అది సాధ్యం. అబ్రాహాము యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.ఆనమ్మికే అతనిని ధన్యుని చేసింది. విగ్రహాలు అమ్ముకొనే వ్యక్తిని భూమి మీద వంశములన్నీ అతని మూలముగా ఆశీర్వదించబడేటట్లు చేసింది. యూదులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని, ముస్లింలను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని, క్రైస్తవులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని, విశ్వాసులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని వీరేకాదు. భూమి మీదనున్న వంశములన్నీ అబ్రహాము మూలముగా ఆశీర్వదించ బడ్డాయి. అదెట్లా?
యేసు ప్రభువువారు కూడా అబ్రాహాము వంశములోనుండే భూమి మీదకి వచ్చి తన ప్రాణమును అర్పించుట ద్వారా సర్వ మానవాళిని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఘనత కూడా అబ్రహాముకు చెందుతుంది. అంతేకాదు. దేవుడే తనకు తాను ఒక మనిషి పేరుపెట్టి పరిచయం చేసుకొంటున్నాడు. నేను “అబ్రాహాము దేవుడను” అని. అబ్రాహాము ఇంతగా హెచ్చించ బడడానికి కారణం?అతడు యెహోవాను నమ్మెను. అందుకే కోరహు కుమారులు పాడుతున్నారు. యెహోవా! నీ యందు నమ్మికయుంచే వారు ధన్యులు. ఈ ఆశీర్వాదం ఒక్క అబ్రాహాముకే పరిమితం కాదు. అట్లా మనమూ నమ్మగలిగితే అబ్రహాము కుమారులుగా తీర్చబడతాం!అట్టి ధన్యత లోనికి మనమూ ప్రవేశించగలం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్! ఆమెన్!ఆమెన్!