ఓ యౌవనుడా!! ఎక్కడ తప్పిపోయావ్?

Technology

ఓ యౌవనుడా!! ఎక్కడ తప్పిపోయావ్?

కంప్యూటర్ యుగంలో జీవిస్తూ, ఆశల పల్లకిలోవిహరిస్తూ,ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ, జీవిత యాత్రలో బుల్లెట్ లా దూసుకుపోతున్నావ్ కదూ? అయితే, దానికంటూ ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం వైపే సాగిపోతున్నావా? లేక గురితప్పిందా? అది ఎక్కడ తప్పింది?నీకంటూ ఒక లక్ష్యం లేదని నేను అనుకోను. లక్ష్యం లేక పరిగెత్తేవాడు పిచ్చోడు. నీవు అట్లా ఎంతమాత్రమూ కాదు. అయితే, నీ లక్ష్యం గురితప్పిందేమో? అన్నదే నా అనుమానం.ఎందుకంటే? రంగుల ప్రపంచంలో పరుగులు తీస్తున్నాము. ప్రతీ రంగులోనూ పాపమే తారసపడింది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. పాపం మరింత దగ్గరై పోతుంది.

ఫోన్ (లాండ్ లైన్) వైర్లతో బంధించబడి ఉన్నంత సేపు మనిషి స్వేచగానే వున్నాడు. ఆ ఫోన్ ( సెల్ ఫోన్) కి స్వేచ్ఛ వచ్చేసరికి, మనిషి బంధీ అయిపోయాడు. అది లేకుండా టాయిలెట్ కి కూడా వెళ్లలేని స్థితి.స్మార్ట్స్ ఫోన్స్ వచ్చి, మనిషిని పిచ్చోడిని చేసేశాయి. రాత్రింబగళ్లు వాటితోనే కాలక్షేపం. చూడకూడనివి చూస్తూ పతనం అంచుల్లోకి చేరుకుంది యువత.వీరిలో నీవూ వున్నావు కదా! నీ గురి తప్పిందని నీకు తెలుసు. అయినా, వాటినే వెంటాడుతున్నావు కదా? నీ ఆశలు తీర్చుకోవడానికి నీ కుటుంబం ఒక అడ్డుబండలా మారిందా? స్వేచ్ఛ కోసం ఆరాట పడుతున్నావా? ఎదో సాధించాలని గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నావా?

నీవలెనే, ఒక యౌవనుడు ఇట్లానే ఆలోచించడం మొదలు పెట్టాడు. తండ్రి దగ్గర వుంటే? తనకి నచ్చినట్లు జీవించడం సాధ్యం కాదు అనుకున్నాడేమో? లేక, పట్టణం వెళ్లి వ్యాపారం చేసి కోట్లు గడించాలి అనుకున్నాడేమో? లేక, పట్టణంలో అనేకమంది అమ్మాయిలుంటారు. అక్కడ మనము ఎట్లా తిరిగినా పట్టించుకొనేవారు ఎవరూ వుండరు అనుకున్నాడేమో? అతని తలంపులే అతనిని చెప్పలేనంత ఆనందంతో నింపేసాయి. ఇక అది క్రియారూపం దాల్చితే? ఓహో! జీవితం అంటే అదే అనుకున్నాడు.

తండ్రి దగ్గర తన వాటా తీసుకొని సుదూర ప్రాంతం వెళ్ళిపోయాడు. అంతా తాను అనుకున్నట్లుగానే జరుగుతుంది. అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, విలాసవంతమైన జీవితం. జీవితం అంటే ఇదే. ఇంతకాలం మిస్ అయ్యాను. కాస్త ఆలస్యమైనా సరియైన నిర్ణయం తీసుకున్నాను అంటూ సంబరపడిపోతున్నాడు. అది ఎంత కాలం? కూర్చొని తింటే? కొండలైనా తరిగిపోతాయట. అదే జరిగింది. వేశ్యలతో కలసి తింటూవుంటే జేబులు ఖాళీ అయిపోయాయి. ఫ్రెండ్స్ అడ్రస్ లేకుండా పోయారు.

సమస్తాన్ని ఖర్చు చేసి, తినడానికి తిండి లేక, తాను బ్రతకడం కోసం ఉద్యోగ వేటలో పడ్డాడు. ఎట్టకేలకు ఉద్యోగం సంపాదించాడు. దానికి కావాల్సిన అర్హత ‘గోచి’ ఒక్కటి చాలు. ఒక జత బట్టకు కూడా అవసర్లేదు. సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాడేమో? ఆకలి బాధ తాళలేక పందుల కాపరిగా చేరిపోయాడు.పందుల పొట్టు చూచేసరికి ఆకలి రెట్టింపు అయ్యింది. యజమాని ఆహారం పెట్టేవరకు ఆకలి బాధను తట్టుకోలేక, పందుల పొట్టు తినబోయి, యజమానికి దొరికిపోయి, గెంటివేయ బడ్డాడు.తాను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాడు. కాని, అతని ప్రయత్నం ఒక్క పూట కూడా తన కడుపు నింపలేక పోయింది.ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితికి గల కారణమేమిటి? నేనెక్కడ తప్పిపోయాను?అంటూ ఆలోచిస్తుంటే, అతనికి అర్ధమయ్యింది.ఎక్కడ తప్పిపోయాడు?తండ్రి ఇంట తప్పిపోయాడని.తండ్రి కంటే ముందుగా దేవుని నుండి తప్పిపోయాడని.

పశ్చాత్తాపము కలిగిన హృదయంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. నా తండ్రి ఇంట పనివారికి సహితం సమృద్ధియైన ఆహారముంది.తిరిగి అక్కడికే వెళ్లి,”తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడనుకాను. నీ పనివారిలో ఒకరిగా నన్నుంచు”.లూకా 15:21
అంటూ క్షమాపణ వేడాలి అనే నిర్ణయానికి వచ్చాడు. బయలు దేరాడు.

బక్క చిక్కి, పిచ్చివాడిలా నడవలేక నడుస్తూ వస్తున్న కుమారుని దూరమునుండే తండ్రి గుర్తు పట్టేసాడు. పరిగెత్తు కెళ్ళి, మెడమీద పడి ముద్దు పెట్టుకొని, ఇంటికి తీసుకు వచ్చి, స్నానము చేయించి, క్రొత్త బట్టలు తొడిగించి, చేతికి ఉంగరము పెట్టి, పాదాలకు చెప్పులను తొడిగించి, క్రొవ్విన దూడను వధించి, విందు చేయించాడు.

ప్రియ స్నేహితుడా!

  • నీవెక్కడ తప్పిపోయావ్?
  • నీవు కోరుకున్న స్వేచ్ఛ నిన్ను ఎక్కడకి నడిపించింది?
  • నీ ఆశలు నిన్ను ఏ వ్యసనాలకు బానిసను చేసాయి?

ఒకవేళ లోకాన్ని అనుభవించడం కోసం దేవుని నుండి పారిపోయి, భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో? నీవు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసినా సమాధానం అంటూ నీ జీవితములో లేకుండా పోయిందేమో? దేవుడు కూడా నన్ను క్షమించడు, చేర్చుకోడు అనే నిర్ణయానికి వచ్చేసావేమో?అయితే, ఆయన ఒక సార్వత్రికమైన పిలుపు నిస్తున్నాడు. దానిలో నీ పేరు కూడా వుంది. నిన్నే పిలుస్తున్నాడు.ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.మత్తయి 11:28

అవును! నీ భారం ఏదైనా కావొచ్చు. అది ఎంతైనా కావొచ్చు. గంతించిన కాలంలో నీ జీవితం ఎట్లాంటిదైనా అయ్యుండొచ్చు.నిన్ను కని,పెంచిన తలిదండ్రులు కూడా నీ తప్పులను క్షమించలేకపోవచ్చు. నిన్ను చేర్చుకోకపోవచ్చు. అయితే, నిన్ను క్షమించేవాడు, నిన్ను చేర్చుకొనే వాడు, నిన్ను ప్రేమించేవాడు ఒకాయన వున్నాడు. ఆయన పేరే ప్రేమా స్వరూపి. ప్రేమించడం ఆయన లక్షణం. అందుకే ఆయన నీకోసం తన ప్రాణాన్ని సహితం పెట్టాడు. ఆయనే ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు.విరిగినలిగిన హృదయంతో, పశ్చత్తాపముతో, ఆయన చెంతకు రాగలిగితే? ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసే వాడు కాదు.

ఆ చిన్న కుమారుడు క్షమాపణ అడగాలని నిర్ణయించు కున్నాడంతే. ఇంకా క్షమాపణ కూడా అడగనే లేదు. అప్పటికే తండ్రి ఎంతగా ప్రతిస్పందించాడో చూడండి.ఆ తండ్రి తన కుమారుని యొక్క అసహ్యమైన రూపాన్ని ఏమి పట్టించుకోలేదు. కౌగలించు కొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకొంటున్నాడు.మన తండ్రి కూడా అంతే. నీవు తిరిగి ఆయన చెంతకు వస్తే? నీ జీవితం ఎట్లాంటిదైనాసరే, నిన్ను తన కౌగిలి చేర్చుకొంటాడు.నీవు తిరిగి వస్తావని, చాచిన చేతులతో దినమెల్లా నీ కోసం ఎదురు చూస్తున్నాడు.ఆ తండ్రి తొడిగించిన వస్త్రాలు రక్షణ, నీతి వస్త్రాలకు, ఉంగరం అధికారానికి, చెప్పులు కుమారుడు అని చెప్పుటకు సాదృశ్యం.( ఆ కాలంలో దాసులు చెప్పులు ధరించడానికి వీలులేదు. కుమారులు మాత్రమే చెక్కతో చేయబడిన చెప్పులు ధరించేవారు)

పప్రియ నేస్తమా!
నీవు ఎక్కడ తప్పిపోయావ్? అది ఏ తప్పిదమైనా సరే! త్రాగుడా? సిగరెట్సా? సినిమాలా? బాయ్ ఫ్రెండ్సా? గాళ్ ఫ్రెండ్సా? ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూనా?విలాసాల కోసం దొంగతనమా? ఎక్కడ తప్పిపోయావ్? ఇంట్లోనా? స్కూల్లోనా? కాలేజ్ లోనా? ఆఫీస్ లోనా? నీవు పని చేస్తున్న స్థలంలోనా? ఎక్కడ? అది ఎక్కడైనా సరే.నీవు ఆస్థితి నుండి లేచిరా.నా జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గరకు వస్తాను అని వాయిదా వేయొద్దు. నీకు నీవుగా ఎప్పటికీ మారలేవు. ఆయన దగ్గరకి వస్తే ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక్క విషయం ఆలోచించు! అనారోగ్యంపాలయినప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్తావు. అట్లానే పాపపు రోగంతో ఉన్నప్పుడే ప్రభువు దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు నీవు వస్తే?నీ తండ్రి నీకు కుమారత్వముతో పాటు నిత్య రాజ్యాన్ని నీకిస్తాడు.అట్టి కృప, ధన్యతదేవుడు నీకు అనుగ్రహించునుగాక!ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Post Author: Sudhakar Babu kona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *