ఓ నేస్తమా! నరకం వాస్తవం!!

hell

ఓ నేస్తమా! నరకం వాస్తవం!!

జీవితం అంటే? సంగీతం వంటిది. దానిని సరిగా శృతి చేస్తే? అత్యంత మధురంగా ఉంటుంది. శృతి తప్పితే? కర్ణ కఠోర మవుతుంది. జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవిస్తే? శృతి తప్పినట్లే. దానికి కొన్ని ఆధ్యాత్మిక సరిహద్దులుండాలి. ఆ సరిహద్దులలో నీవుంటే? నీ జీవితం శృతిలో వున్నట్లే.

ఎందుకంటే? భూమి మీద నీవు జీవించిన జీవితమే, నీ నిత్యత్వాన్ని నిర్ణయించేది. మరణం తర్వాతే అసలైన జీవితం వుంది. కానీ, అప్పుడు చెయ్యడానికి నీకంటూ ఏమి వుండదు. మరణం తర్వాత మరొక జీవితం వుందని, ఎవరు చూసారు? అంటూ హృదయాన్ని కఠినం చేసుకొనే ప్రయత్నం వద్దు. నీవు జన్మించక ముందు, భూలోకం అంటూ ఒకటి ఉంటుందని నీకు తెలియదుకదా? అట్లానే మరణం తర్వాత మరో లోకంలో అడుగుపెడితేనే గాని, నిత్య జీవం, నిత్య మరణం ఉన్నాయని నీకు తెలియదు. నిత్య మరణం లోనికి అడుగుపెట్టాక నీవు చెయ్యడానికంటూ ఏమి వుండదు. కేకలు, అరుపురు తప్ప. అవును! అక్కడ అగ్ని ఆరదు. పురుగు చావదు.

పరిశుద్ధ గ్రంధములోనుండి, యేసు ప్రభువు చెప్పిన లూకా 16:19-31 లో గల ఉపమానాన్ని నీకు జ్ఞాపకం చెయ్యడానికి ఇష్టపడుతున్నాను.

ధనవంతుని జీవన విధానం:

ఖరీదైన వస్త్రాలు, సమృద్ధి యైన ఆహారం, విలాసవంతమైన జీవితం.
లాజరు జీవిత విధానం:చిరిగిన బట్టలు, క్రిందపడిన రొట్టెముక్కలు, అత్యంత దయనీయమైన జీవితం.

ధనవంతుని మరణం:

ధనవంతుడు చనిపోతే, డప్పులు వాయిస్తూ పాతి పెట్టేవాళ్లున్నారు. కాని, పరమునకు చేర్చే వారెవ్వరూ లేరు.

లాజరు మరణం:

లాజరు చనిపోతే పాతి పెట్టేవారేవ్వరూ లేరు. కాని, పరమునకు చేర్చడానికి దేవదూతలున్నారు.

ధనవంతుని మరణం తర్వాత గమ్యం “పాతాళం”:

ధనవంతుడు పాతాళంలో యాతన అనుభవించడానికి గల కారణం ఏమిటి?ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది (గలతి 5:14). అయితే ధనవంతుడు, దరిద్రుడైన లాజరు పట్ల కనీస జాలి చూపకుండా ” నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము.”(మార్కు 12:31) అనే ఆజ్ఞను పూర్తిగా నిర్లక్ష్యం చేసాడు.దాని ప్రతిఫలం?నిత్యమైన యాతన.

లాజరు మరణం తర్వాత గమ్యం “అబ్రాహాము రొమ్ము”

(చెర): అంటే? పాతనిబంధన పరిశుద్ధుల ఆత్మలు వుండే చోటు.లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కారణం ఏమయ్యుండొచ్చు?అతని దారిద్ర్యమేనా? కానే కాదు. శారీరికంగా దరిద్రుడైనా, ఆత్మీయంగా అత్యంత ధనవంతుడై యుండాలి.క్రిందపడే రొట్టె ముక్కలకొరకే ఎదురు చూసాడు గాని, ఎన్నడూ దొంగిలించిన వాడు కాదు.ధనవంతుని విలాసవంతమైన జీవితాన్ని చూచి, ఎన్నడూ అతని మీద అసూయ చెందినవాడు కాదు.తన దారిద్ర్యాన్ని చూచుకొని, నన్నెందుకు ఇట్లా ఉంచావు అని, ఎన్నడూ దేవునిని ప్రశ్నించిన వాడు కాదు.శ్రమలయందు తన విశ్వాసాన్ని, శోధనలయందు తన పరిశుద్ధతను కాపాడుకొనిన వాడైయుండాలి.అవును! వాటి ప్రతిఫలం?నిత్యమైన సమాధానం.

అబ్రహాము రొమ్మున లాజరు అనుభవాలు:

ఆకలి లేదు,దాహం లేనేలేదు, నిత్యమైన విశ్రాంతి (నెమ్మది).

పాతాళంలో యాతన పడుతున్న ధనవంతుని అనుభవాలు:

కన్నులెత్తి చూస్తున్నాడు:భూమి మీదున్నంత కాలం ఈ పని చెయ్యకుండా, శరీరానుసారంగానే జీవించాడు. ఇప్పుడు పాతాళంలో కన్నులెత్తినా? సహాయం చేసేవారు లేనే లేరు.మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, …పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;కొలస్సి 3:1

కనికర పడమని బ్రతిమాలు తున్నాడు: కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.(మత్తయి 5:7). దరిద్రుడు ఇంటి వాకిట్లో పడియుంటే, కనికరపడినవాడు కాదు. ఇప్పుడు పాతాళంలో కనికరం కొరకు ప్రార్ధించినాగాని, కనికరం చూపేవారెవ్వరూ లేరు.మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.(గలతి 6:7).

ఒక్క నీటి చుక్క కోసం ఆరాట పడుతున్నాడు: భూమి మీద నున్నప్పుడు, జీవజల బుగ్గ యైన దేవుని తలంపు లేనే లేదు. నేనిచ్చే నీళ్లు త్రాగితే మరెన్నడూ దప్పిగొనవని చెప్పిన యేసు క్రీస్తు ప్రస్తావన లేనే లేదు.అయితే, ఇప్పుడు యాతన స్థలంలో దాహం తీర్చు కోవడానికి ఒక్క నీటి బొట్టుకోసం ఆరాట పడుతున్నాడు. ఆ ఒక్క నీటి బొట్టు దొరికినా, అక్కడ ఉండేది జీవజలం కాబట్టి అతని దాహం తీరుతుంది. కానీ, ఆ ఒక్క నీటి బొట్టును సహితం తన నాలుక మీద వేసే వారెవ్వరూ లేరు.

కేకలు వేస్తున్నాడు: బహుశా భూమి మీద ప్రార్ధించడానికి సిగ్గుపడ్డాడేమో? ఇప్పుడు పాతాళంలో సిగ్గులేదు. అరుస్తూనే వున్నాడు. కానీ, అతని అరుపులు అరణ్య రోధనే తప్ప, ఫలితం శూన్యం. పాతాళం దద్దరిల్లినా గాని, అతని కేకలు వినేవారు లేనేలేరు.

తన సహోదరుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు: నాకు ఐదుగురు సహోదరులు వున్నారు. వారు ఈ యాతన స్థలానికి రాకుండా లాజరును పంపమని అబ్రాహామును ప్రాధేయ పడుతున్నాడు. అయితే, ఆ యాతన స్థలంలో ఎంత ప్రార్ధించినా, వినేవారు లేనేలేరు. ఆ ప్రార్ధన భూమి మీద నున్నప్పుడే అతడు చేయాల్సింది.

లాజరును సాక్షిగా పంపమని బ్రతిమాలు తున్నాడు: ధనవంతుడు జీవించి యున్నప్పుడు అనేకమంది సాక్షులు అతని దగ్గరకు వచ్చినా త్రోసివేసాడేమో? దేవుని సువార్తను ప్రకటించడానికి ఎప్పుడూ సహకరించిన వాడూ కాదు. అట్లా అని, ఇతడు దేవుని గురించి తెలియని వాడు కాదు. అబ్రాహామును ‘తండ్రీ’ అని పిలుస్తున్నాడు. అన్ని తెలిసి కూడా, నీలానే ఈ జీవితం తర్వాత మరొక జీవితం వుందని, అది శాశ్వతమైనది నమ్మినవాడు కాదు.

దీనికి కూడా అతనికి సమాధానం లేదు. అబ్రాహాము చెప్తున్నాడు. భూమి మీద అనేకమంది సేవకులున్నారు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఇక్కడనుండి ఒకరిని పంపినా వారు నమ్మరు. అద్భుతాలు కాదు. దేవుని వాక్యమే అత్యంత ప్రాముఖ్యమైనది.

  • పాతాళంలో ప్రశ్నలు అనేకం. కానీ, ఒక్కదానికి కూడా సమాధానం వుండదు.
  • సమస్యలు అనేకం, కానీ ఒక్కదానికి కూడా పరిష్కారం వుండదు.
  • అనునిత్యమూ ప్రార్ధనే. కానీ, వినే వారుండరు.

ప్రియా నేస్తమా!

చూచి నమ్మిన వారికంటే, చూడక నమ్మిన వారు ధన్యులు. అక్కడ ‘యాతన’ వుంది. ఇది స్వయంగా యేసుప్రభువు చెప్పిన ఉపమానం.దాని నుండి, నీవూ నేనూ తప్పించబడాలి. ధనముంది, బలముంది, అందముంది … అంతా అయ్యాక చూద్దాంలే. అంటూ నిర్లక్ష్యం చేశావంటే? ఆ యాతనను తప్పించుకోలేవు. వద్దు! అది ఊహలకే భయంకరం. అయితే, ఏమి చెయ్యాలి? మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఆ ధనవంతుడు పాతాళంలో చేస్తున్న పనులన్నీ ఇప్పుడు, భూమి మీదే మనము చెయ్యాలి. తద్వారా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Post Author: Sudhakar Babu kona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *